Download Post
6 months
అద్దె ఇంట్లో ఉన్నవాడు, ఆ ఇంట్లో ఉన్నంతకాలం 'మా ఇల్లు' అనే అంటాడు.
తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఇంటి యజమానితో కూడా అదే అంటాడు 'ఏమండీ! రేపు మా ఇంటికి రండి...'అని.
'మా ఇల్లు' అన్నాడని అతనితో యజమాని గొడవపడడు.యెందుకంటే వ్యవహారం కోసమే అలా అంటారని ఇరువురికీ తెలుసు.
అలాగే ఈ తనువు తనకు అద్దె ఇల్లు లాంటిది. వ్యవహార నిమిత్తం నాశరీరం, నా సంసారం, నా ప్రపంచం, నా దైవం అంటాడు.
కానీ,యజమాని భగవంతుడు.
యజమాని భగవంతుడు అనేది జ్ఞప్తి కలిగి ఉన్నవాడు - జ్ఞాని. మరచి ఉన్నవాడు - అజ్ఞాని.
అద్దె ఇల్లు పెచ్చులూడితే అద్దెకున్నవాడు ఏమీ చింతించడు.ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇల్లు చూసుకుంటాడు.
ఇక ఈ శరీరం నిలబడని వ్యాధి వచ్చింది...వదిలేసి మరొక ఉపాధిని వెతుక్కుంటాడు.అదే పునర్జన్మ.
ఇల్లు మారితే యజమాని మారుతాడు.కానీ శరీరం మారితే యజమాని (భగవంతుడు)మారడు.
సకలసృష్టికీ యజమాని ఆయనే.సృష్టి యావత్తు భగవంతునికి ఓ సంకల్పం అంతే.
ఆయన ఒకేసారి మొత్తాన్ని ఖాళీ(లయం) చేసేస్తాడు.అనగా సంకల్పరాహిత్యంగా ఉంటాడు.నీవు నిద్రలో ఉన్నట్టు.
దేవుని సంకల్పరాహిత్యమే జీవునికి జన్మరాహిత్యము.
కాబట్టి బంధమైనా, మోక్షమైనా భగవంతుని సంకల్పమే.
అందుకే అన్నమయ్య ఓ సంకీర్తనలో ఇలా అన్నారు "మదిలో చింతలు, మైలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక."
భగవంతుడు "వద్దు" అనుకుంటే ఉండవు.అంతేగానీ మనం వద్దు అనుకుంటే పోవు.
నా సంకల్పం కూడా భగవంతుని సంకల్పంలో అంతర్భాగమే కదా అంటావేమో!
ఇక బాధేముంది..?
నీ శరీరం భగవంతుని శరీరంలో(సృష్టిలో) అంతర్భాగం. నీ మనస్సు భగవంతుని మనస్సులో(మాయలో) అంతర్భాగం.
జీవుని బంధమోక్షములు దేవుని లీలావిలాసములు.
శరీరం ఉంటే ఉండనీ... ఊడితే ఊడనీ...
బంధం ఉంటే ఉండనీ, మోక్షం వస్తే రానీ...
ఏదైనా సరే ఉంటే ఏమి..? లేకుంటే ఏమి..?అని ఉండటం జ్ఞానిలక్షణం..
అచలరూపుడైన పరమేశ్వరుని సంకల్పపరంపరయే ఈ బ్రహ్మాండగోళములుగా మహా సృష్టి ఏర్పడింది...
జగత్తు యావత్తు శివుని సంకల్పరూపమే.శివుడు మెలకువతో కనే కలే ఈ ప్రపంచం.
ఆపదలోకి త్రోయడం,ఆపద నుంచి రక్షించడం...ఆ క్రీడలో భాగమే.
అజ్ఞానానికి గురి చేయడం...దానిని తొలగించడానికి జ్ఞానప్రబోధం చేయడం...ఆ క్రీడలో భాగమే.
మంచి-చెడులనే తక్కెడలను అటు ఇటూ సమాంతరంగా లేనట్లు...మళ్లీ ఉన్నట్లు... సరిచూసుకుంటూ ఉండడం ఆ క్రీడలో భాగమే.
ప్రతిజీవి కర్మఫలాన్ని ప్రతిజీవికీ సరాసరిన పంచుతూ ఉండడం ఆ క్రీడలో భాగమే.
అవతరించడం...అనుగ్రహించడం....ఆగ్రహించడం...అంతం చేయడం...ఆ క్రీడలో భాగమే.
ఆ క్రీడలో "ఎందుకు" అనే ప్రశ్నకు తావులేదు.యెందుకంటే అది క్రీడ కాబట్టి...
క్రీడలో గెలుపు ఓటములు రెండూ వినోదమే కాబట్టి.
ఆ క్రీడలో భాగంగానే... సకల నామరూపాలూ తానే...
దేవ-జీవ భేదం తొలగిపోవడమే దైవోపాసన యొక్క అంతిమ ప్రయోజనం.
అనేకత్వాన్ని విడిచి ఏకత్వం వైపుకు చేరడమే ఈ ఆధ్యాత్మికతకు అంతిమ ప్రయోజనం.
ఈశ్వరుడు వేఱు, నేను వేఱు అనే భావముతో కూడిన ఈశ్వరభావన కంటే 'అతడే నేను' అన్న అభిన్నభావనయే పావనమైనది అన్న రమణుల మాటే పరమ ప్రమాణం.
రంగులరాట్నానికి మధ్యభాగములో అన్ని గుర్రాల పరుగులకు ఆధారమై, అచలమై ఉన్న స్తంభం వంటివాడు పరమేశ్వరుడు.
జీవుడు నాణేనికి బొమ్మ బొరుసు వలె చల-అచల ప్రవృత్తులను కలిగి ఉంటాడు. అందువల్లనే జీవుడు బంధ-మోక్షముల మధ్య ఊగిసలాడుతుంటాడు.
జీవుడికి శాశ్వతమైన బంధమూ లేదు, శాశ్వతమైన మోక్షమూ లేదు.ఈ లీల అనంతం. "ఎందుకు..? " అన్న ప్రశ్న అనవసరం.
సముద్రంలో కలిసేవరకు నదికి ఒడిదుడుకులతో కూడిన ప్రవాహం ఉన్నట్టు దేవునిలో కలిసేవరకు జీవునికి సుఖదుఃఖరూపంతో కూడిన సంసారం ఉంటుంది.
అహంమూలాన్ని కనుగొనడమే గొప్ప తపస్సు అంటారు అరుణాచల రమణభగవానులు...
ఒకటి వెలుపలి సౌందర్యం...మరొకటి లోపలి సౌందర్యం...
రమణులు అన్నట్లు "ఒకటే" మూడయ్యింది. ఎప్పుడును మూడు మూడే అనుట అహంకారము. మూడూ "ఏకం" అనుట అహంస్వరూపము.
దుఃఖం, సుఖం రెండూ దైవప్రసాదితాలే...బంధం, మోక్షం రెండూ దైవానుగ్రహాలే..
ప్రతి కష్టంలోనూ మన వైపు దైవం ఒక కన్ను వేసి వుంచే వుంది...అని తెలిసినప్పుడు ఆ కష్టపరిస్థితి నుండి తెలియకుండానే దాటేయగలం.
ఏడ్వడంలో ఉన్న సుఖం ఏడ్చినవానికే తెలుసును. బంధం కూడా మోక్షమంత సుఖమయ వారాశి.
ఏడుపు అనేది పై పొర మాత్రమే. లోపలంతా గొప్ప సుఖం నిండి ఉంటుంది.
నవ్వు అనేది పై పొర మాత్రమే.లోపలంతా గొప్ప దుఃఖం నిండి ఉంటుంది.
సుఖ-దుఃఖాలు గొప్ప స్నేహితులు....ఒకణ్నే రమ్మనలేం.ఒకణ్నే కాదనలేం.
ఒకణ్ణి పిలిస్తే ఇద్దరూ వస్తారు.ఒకణ్ణి కాదంటే ఇద్దరూ రారు.
ఇద్దరూ కావాలంటే - సంసారం.ఇద్దర్నీ కాదంటే పరమపదం.
ఏకకాలంలో సంసారంలో ఉంటాను, పరమపదంలోనూ ఉంటాను.వెలుపల నేను జీవుణ్ణి, లోపల నేను దేవుణ్ణి.
వెలుపల నేను సంసారిని, లోపల నేను సన్న్యాసిని. వెలుపల నేను మనిషిని, లోపల నేను ఋషిని.✍🏾