Download Post
2 months, 2 weeks
రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి పౌరుడికీ డిజి లాకర్
రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి పౌరుడికీ డిజి లాకర్ సదుపాయాన్ని కల్పిస్తామని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్వెల్లడించారు.
పౌరులు తమకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలేవీ భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణా పొందవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) శుక్రవారం సచివాలయంలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ డేటా అనేది లేదన్నారు. ఆయా శాఖల్లో చాలా డేటా ఉన్నప్పటికీ అది అనుసంధానం కాలేదన్నారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగేపని లేకుండా పౌరులకు వారికి కావాల్సిన అన్ని సేవలు వారి చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే అందించాలనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిందన్నారు. రానున్న రోజుల్లో అన్ని సేవలు, అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఇందులో పొందే సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రతి శాఖలోనూ ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ (సీడీటీఓ)ను నియమించుకోవాలని భాస్కర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి కె. దినేష్ కుమార్, డిప్యూటీ సీఈఓ మాధురి, పౌరసరఫరాల శాఖ ప్రత్యేక అధికారి సౌరవ్ గౌర్, ఐజీ టెక్నికల్ సర్వీస్ శ్రీకాంత్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీరపాండ్యన్, జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.