Download Post
3 months, 4 weeks
సమాజం ఎలా ఉంది?
*******
సమాజం (Society) అంటే
మానవులు కలిసిమెలసి పరస్పర సహకారమందించుకొంటూ,
సమిష్టిగా జీవిస్తుండే నిర్దిష్ట సమూహాం.
సమాజం ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన నిర్దిష్ట సమూహాన్ని, సమాజం అంటారు.
అలాగే వారు సభ్యులుగా ఉన్న విస్తృత సమాజాన్ని కూడా సూచిస్తుంది. విడిగా సాధ్యమయ్యే దానికంటే సమూహంగా
ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి
ప్రజలు, సమాజాలను ఏర్పరుచు కున్నారు
మానవ తొలి దశలో మానవులు సమూహాలుగా జీవించారని చరిత్ర తెలుపుతోంది. ఆదిమ మానవ సమాజంలో కులాలు లేవు. మతాలు లేవు.
అందరూ కలిసి వేటాడేవారు.వేటాడిన మాంసాన్ని అందరూకలిసి భుజించేవారు.
వివాహాలు లేవు. విడాకులు లేవు.చట్టాలు లేవు. భూతగాదాలు లేవు.డబ్బు కోసం మోసాలు లేవు.హత్యలు లేవు. హెచ్చు తగ్గులు లేవు.ఆడామగా విచక్షణ లేదు.
ఎవరు ఎవరితో నైనా స్వేచ్ఛగా సమానత్వంగా ఉండవచ్చును. ఇది ఇది ఒక రకమైన సమసమాజ జీవనమని చెప్పవచ్చు.
మన సమాజంలో
*******
మనుషులంతా ఒక్కటే అన్న భావన లేదు.
సమాజంలోని మనుషుల మధ్య విడదీయలేనంతగా కుల,మత దైవ అసమానతలు ఉన్నాయి.
మనుషులు కులం పేరుతో, మతం పేరుతో, అగ్రవర్ణాల పేరుతో, నిమ్నకులాల పేరుతో విభజించబడ్డారు.
ఒక మనిషిని ఇంకో మనిషి దోపిడీ చేసే విధానం ఉంది.
బలవంతుడు, బలహీనుడి పై ఆధిపత్యం చెలాయించే దుర్మార్గపు విధానం ఉంది.
ఆర్థిక సమానతలు లేవు
సామాజిక న్యాయం లేదు.
సమాజం నిండా మోసగించే వారు ఉన్నారు మోసపోయేవారు ఉన్నారు.
అన్ని కులాల వారు ఉన్నారు అన్ని మతాలవారు ఉన్నారు. కానీ కులమత వర్గ వర్ణ రహిత మనిషి మాత్రం లేడు.
ప్రపంచంలో అన్ని దేశాల సమాజాల కన్నా
మన దేశప్రజలు విద్యలో వెనుకబడి ఉన్నారు.
మన దేశంలో కేవలం 40 శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు.సామాజిక వ్యవస్థ
అస్తవ్యస్తం కావడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.
అలా అని అదే పూర్తి కారణం కాదు.
మనం ఉన్న సమాజాన్ని,మన చుట్టూ ఉన్న సమాజాన్ని దగ్గరగా పరిశీలించినట్లయితే,
రైతులున్నారు, వ్యాపారస్తులున్నారు,
డాక్టర్లున్నారు, ఇంజనీర్లున్నారు,
ఉపాధ్యాయులున్నారు, వివిధ వృత్తుల వాళ్ళు ఉన్నారు కానీ "మనిషి"అనే వాడు కరువైనాడు.
కొందరు విద్యావంతులైన ఉపాధ్యాయులు,
డాక్టర్లు, లాయర్లు,ఇంజనీర్లు,శాస్త్రవేత్తలు
కూడా సహేతుకంగా ఆలోచించడం లేదు.
మతం విషయంలో, దేవుని విషయంలో, సంప్రదాయాల విషయంలో,ఆచారాల విషయంలో, మూఢత్వం,అజ్ఞానంలో ఉన్నారు.
మూఢాచారాలు పాటిస్తున్నారు.
ఇలా అయితే దేశం వైజ్ఞానికంగా ఎప్పుడు? ఎలా ముందుకు పోతుంది?
సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ప్రజలు పూర్తిగా విఫలం అవుతున్నారు
లంచగొండితనం, అవినీతి,అక్రమాలు,దౌర్జన్యాలు, హింస నానాటికీ పెరిగిపోతున్నవి.
మతం సూచించిన న్యాయమే, ధర్మమే,
మత నియమాలే సమాజంలో ఆచరణలో ఉన్నాయి.
మతాల ధర్మమే తప్ప,మానవ ధర్మం మచ్చుకైనా కానరావడం లేదు.
సైన్స్ విజ్ఞానము, కేవలము మనిషి తన అవసరాలకి వాడుకుంటున్నాడు తప్ప,
సైన్స్ యొక్క విజ్ఞానము, సైన్స్ యొక్క గొప్పతనము, దాని తత్వము గ్రహించక తన జీవితానికి అన్వయించుకోవడం లేదు.
స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు సజీవ దహనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
,మహిళలపై అణచివేత సమాజంలో తీవ్ర స్థాయిలో ఉంది.
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ మహిళలపై 93 అత్యాచార, 128 హత్యలు, 415 లైంగిక వేధింపుల కేసులు నమోదు అవుతున్నాయి.
ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదు.
ఈ క్రమంలో అరెస్ట్ చేసిన వారిని ఎన్ కౌంటర్ చేయాలని, బహిరంగంగా ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కానీ ఉరి తీయడం,మరియు ఎన్కౌంటర్లు ఈ సమస్యకు పరిష్కారం కాదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
సినిమాలలో, స్త్రీలను ఆటవస్తువుగా,అర్థనగ్నంగా,
అశ్లీల పదారలతో కూడిన నృత్యాలు.
గుడ్డ పేలికల దుస్తులతో చూపెట్టడం ఒక కారణమని చెబుతున్నారు.
మత గ్రంధాలలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, స్త్రీల పట్ల చూపిన నిర్లక్ష్యం నిరాదరణ కూడా వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు వీటిని ఒక కారణం గా చెప్తున్నారు.
సమాజంలో సగ భాగం జనాభా కలిగి ఉన్న స్త్రీల విషయంలో రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో మరియు ఇతర రంగంలో వారికి రావాల్సిన వాటా వారికి లభించడం లేదు. వారిపట్లతీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
వారి హక్కులకు భంగం కలిగిస్తున్నారు అణిచివేతకు గురి చేస్తున్నారు.
కనీసం ఒక మనిషిగా అయినా చూడడం లేదు. కేవలం పురుషుని అవసరాలు తీర్చే ఆటబొమ్మగా, విలాస వస్తువుగా పరిగణిస్తున్నారు.
మనిషి చంద్రమండలానికి పరుగులు పెడుతున్నాడు.కానీ పక్కనున్న తోటి
మనిషి పట్ల అసహ్యకరమైన భావన, నిర్లక్ష్యతను ప్రదర్శిస్తున్నాడు.
మన సమాజం భౌతికంగా వైజ్ఞానికంగా ముందడుగు వేసింది ఎంతో అభివృద్ధి సాధించాం. కలలోనైనా ఊహించని అభివృద్ధిని సాంకేతికంగా సాధించుకున్నాం.
వాయు వేగాన్ని మించిన వాహనాలు సమకూర్చుకున్నాం.
కట్టుబొట్టు,దుస్తులు,నడవడిక తీరు
మార్చుకున్నాము.
"పారిశ్రామిక విప్లవం"తో వివిధ రకాల పరిశ్రమలను స్థాపించుకుని మన సుఖం కోసం ఎన్నో రకాలైన వస్తువులు తయారు చేసుకుంటున్నాం.
"హరిత విప్లవం" తో వ్యవసాయ రంగంలో ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలు తయారు చేసుకున్నాము.
అసాధ్యమనుకున్న గగన ప్రయాణాన్ని సుసాధ్యం చేసుకున్నాము.
కానీ మనుషుల భావాల్లో మాత్రం మార్పు సాధించుకో లేకపోయాము.
మనిషిలో,స్వార్ధపరత్వం అనకొండలా పెరిగి మనిషిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
సమాజంలో మోసగించేవారు అధికము అవుతున్నారు. అదే క్రమంలో మోసగించ బడేవారు కూడా పెరుగుతున్నారు.
మనిషిలో మనం చూస్తున్న నవ్వులు నిజమైన నవ్వులు కావు.
ఏడుపులు నిజమైన ఏడుపులు కావు.
అవి ఎదుటి వ్యక్తిని మోసం చేసి తన అవసరాలు తీlర్చుకోవడానికే నటిస్తున్నాడు.
సమాజంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంది. అతి కొద్దిమంది పెట్టుబడిదారులు కోట్లాది ప్రజలపై అధికారం చెలాయిస్తున్నారు.
నేటి సమాజంలో మనిషి తత్వం మాయమయి,అట్టి స్థానంలో పశువు కన్నా హీనమైన తత్వం మనిషి లో ప్రవేశించింది.
మనిషిలో ఉండే సహజ లక్షణమైన హేతువు, విచక్షణ, జ్ఞానం,వివేకం,సహకారం ఇలాంటివి కనుమరుగైపోతున్నవి.
సమాజంలో మనుషుల మధ్య అసమానతలు, ఉచ్చ నీచ తారతమ్యాలు పెరిగి పోయినవి.
మనిషి పట్ల గౌరవము,ఆప్యాయత, అనురాగం, ప్రేమ తత్వము క్రమంగా అడుగంటిపోతున్నవి.
ఆధునికత, ఆధునిక విజ్ఞానం ఎంతగా పెరిగిపోతున్నదో, అంతగా మానవత్వం తగ్గిపోతుంది.
మనిషి భౌతికంగా వేష భాషలు,మాట తీరు, నడకతీరు మారిందే తప్ప, కొన్ని వేల ఏళ్లనాటి మానసిక భావనలు ఇంకా మారలేదు.
మానవుడు సుఖాల కోసం అన్వేషణ చేస్తున్నాడు. తన సుఖం కోసం శాస్త్ర విజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకొని, అత్యంత సుఖప్రదంగా జీవించాలని భావిస్తున్నాడు.
అందుకోసం విజ్ఞానాన్ని తామరతంపరగా ఉపయోగిస్తున్నాడు.కష్టపడకుండా జీవనం సాగించాలని మనిషి ఆలోచన చేస్తున్నాడు. అందుకోసం అనేక వస్తు సముదాయాన్ని సృష్టించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన తోటి మనిషిని పట్టించుకోవడం లేదు.
"తోటి మనిషి కూడా తన లాంటి మనిషే" అన్న భావన క్రమక్రమంగా మనిషిలో తగ్గిపోతున్నది.
తన సుఖమే తన స్వార్థమే ప్రధానంగా చూసుకుంటున్నాడు.
మనిషి తన వెనకటి భావాలను మార్చుకోవడం లేదు.
మనిషి ఆనాడు ఊహించిన దైవ రూపాలను, ఆచారాలను, సంప్రదాయాలను,అజ్ఞానానికి విలువ నిచ్చి అవి నిజమని, అవే పవిత్రములని ఇప్పటికి కూడా వాటికే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
రోజు రోజుకి పెరిగిపోతున్న సైన్సు వేల ఏళ్ల నాటి ఊహ రూపాలను ఆచారాలను సంప్రదాయాలను తప్పు అని తేల్చినా, వాటికి సాక్ష్యాధారాలు లేవని నిరూపించినా,అవన్నీ అవాస్తవాలని రుజువు చేసినా ఇంకా మనుషుల్లో వేల ఏళ్లనాటి భావాలు గూడు కట్టుకొని,నిర్మూలించ లేనంతగా అలాగే ఉన్నాయి.
వేల ఏళ్ల నాటి మానవుడు ప్రకృతి సంఘటనలకు కారణం తెలియకుండా ఏర్పరచుకున్న దైవ రూపం నిజానికి అబద్ధమని అవాస్తవమని తెలిపిన ఇంకా ఇంకా అట్టి దైవ రూపాలను వదల లేకున్నాడు.
మనిషికి అందిన సైన్సు జ్ఞానాన్ని, మూఢాచారాలను మూఢనమ్మకాలను స్థిర పరుచుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడు.
ప్రపంచం, విజ్ఞానం వైపు పరుగులు పెడుతుంటే మన దేశంలోని 99 శాతం ప్రజలు మాత్రం వేల ఏళ్ళ నాటి మత గ్రంధాలను, మత నియమాలను, మతాచారాలను ఆనాడు మనుషులు ఊహించిన దేవతలను పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ, మూఢత్వం,అజ్ఞానంలో ఉంటున్నారు.
మనుషులను హేతుత్వంతో ఆలోచించకుండా, నిజాలను గ్రహించే సమయం ఇవ్వకుండా, కొన్ని స్వార్థపర శక్తులు, స్వార్థంతో, పరాన్నబుక్కులు గా బతికే సోమరులు, ప్రజల అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని సొమ్ము చేసుకునే దోపిడీదారులు, మరియు మూడత్వాన్ని,మూర్ఖత్వాన్ని, అహేతుకతను, అజ్ఞానాన్ని బోధించే మత గ్రంధాలు ప్రజల్లోని అజ్ఞానాన్ని అలాగే ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాయి.
సమాజం ఉండవలసిన విధంగా లేదు.
************
అనేక అవాంఛిత ధోరణులు, అసహజ ,
ఆహేతుక విధానాలు నిండి ఉన్నవి.
దీని వల్ల సామాన్య ప్రజానీకం తమ కష్టార్జితాన్ని, తమ విలువైన సమయాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు. మనుషుల్లో సమానత్వం లేకుండా పోతుంది.
సమాజంలో ఇలాంటి దుష్ట భావనలకు కారణాలు ఏమిటో చూద్దాం.
1) మత గ్రంధాలు,
********
అసహజమైన, అహేతుకమైన, ఊహాజనిత మత గ్రంథాల కట్టుబాట్లు, నియమాలతో నిండిన మత గ్రంధాలను నమ్మి ప్రజలు అజ్ఞానంలో ఉండిపోతున్నారు. మత గ్రంధాలు, పురాణేతిహాసాలు, వేదాలు వీటి ప్రభావంతో మానవుడు పురాణ పురుషుల పాత్రలను దైవాలుగా భావించి పూజించడం మొదలు పెట్టిన తర్వాత అస్తిత్వవాదం ప్రారంభమైంది.
మత గ్రంధాలలో ప్రవచించిన ధర్మమే ధర్మమని, పురాణాల పాత్రలన్నీ దైవాంశ సంభూతులని, వారిని అనుసరించాలన్న పండితుల మాటలు విని ప్రజలు మత గ్రంధాలను పవిత్రమైనవిగా భావిస్తున్నారు.
ప్రజలలో స్వయం ఆలోచన లేకనే ఇలాంటి వాటిని అనుసరిస్తున్నారు.
తర్వాత భౌతికవాదం ఆతర్వాత చార్వాక, జైన బౌద్ధ వాదనలు బయల్దేరిన తరువాత అస్తిత్వవాదం కొంత మరుగున పడిపోయింది.
తర్వాత కొందరు బ్రాహ్మణపండితులు రాజుల సహకారముతో సనాతన వాదులు మరల బౌద్ధాన్ని నిర్వీర్యం చేసి తిరిగి సనాతన వాదం సమాజంలో స్థిరీకరించడానికి దౌర్జన్యంతో బౌద్ధ భిక్షువులను సంహరించారు. మిగిలిన బౌద్ధ భిక్షువులు ఇతర దేశాలకు పారిపోయారు. మరల సనాతన వాదం వేగం పుంజుకుంది.
ప్రజలు మతం, మత గ్రంథాల ప్రభావముతో వాటిని ప్రచారం చేసే ఆస్తికుల చర్యలతో ప్రజలు ఇంకా అసహజ, అజ్ఞాన పూరితమైన భావన లోనే ఉన్నారు.
ప్రస్తుతం సమాజంలో అస్తిత్వవాదం బలపడి ఉంది.
2) దైవ భావన
*****
సైన్స్ అభివృద్ధి చెందినను వైజ్ఞానిక దృక్పథం పెరిగిపోయినను అధిక సంఖ్యాకులైన ప్రజలు ఇప్పటికీ మత గ్రంధాలు నిజమని పురాణ పాత్రలు దేవుళ్ళని వారి విగ్రహాలను పెట్టి,కోట్లాది రూపాయలతో గుళ్ళు కట్టి నిరంతరం, నిత్యం పూజాదికాలు నిర్వహించి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తున్నారు అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నారు.
కానీ దైవం ఉన్నట్టుగా ఏ మతం వారు నిరూపించ లేకపోయారు ఉన్నట్టుగా సాక్ష్యాధారాలు, ఉనికి లేదు. వేల ఏళ్ల నాటి నుండి ఇప్పటివరకు కూడా దేవుడు ఉన్నట్టుగా ఎవరికీ,ఏ విధమైన సూచనలు లభించలేదు.
సమాజంలో 90 శాతానికి పైగా ఇదే భావనలో ఉన్నారు ఇదే దేశాభివృద్ధికి పెద్ద ఆటంకంగా తయారయింది.
3) సమాజ విధ్వంసంలో పాలకులదే ప్రధాన పాత్ర:-
**************
మనది ప్రజాస్వామ్య దేశం అని గొప్పగా ప్రకటించుకున్నాము.
ప్రజాస్వామ్యం అంటే "ప్రజల కొరకు,ప్రజల చేత పరిపాలింపబడు ప్రభుత్వం"అని అర్థం.
కానీ ప్రజాస్వామ్యం అర్థమే మారిపోయింది. ప్రజాస్వామ్య స్థానంలో నాయక స్వామ్యం,
పార్టీ స్వామ్యం, నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ వస్తున్నది.
మనం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసుకున్నాము.
రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నాము.
ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండటంలేదు.తమ స్వార్థం కోసమే , తమ కోసమే తమ పదవి నిలుపుకోవడాని కోసమే, తాము అధికారం చెలాయించడానికి ప్రభుత్వ వ్యవస్థలను తమకు ఇష్టమైన రీతిలో వినియోగించుకుంటున్నారు.
అదేమని ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదు.
ఉచిత, ఆకర్షణీయమైన పథకాలతో ప్రజలకు ఆశలను కల్పించి, ఆకర్షించుకొని ఓట్లు వేయించుకొని.అధికారం చేజిక్కించుకుంటున్నారు.
ప్రజలు తాము ఉచితాలకు ఆశపడి, అలవాటుపడి అదే అభివృద్ధి అనుకొని దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి తీరని నష్టం కలిగిస్తున్నామని అనుకోవడం లేదు.
ఉచిత మరియు ఆకర్షణీయమైన పథకాలు తాత్కాలిక ప్రయోజనాలను కలిగిస్తాయి తప్ప, శాశ్వతమైన,నిర్మాణాత్మకమైన ప్రగతికి దోహదం చేయవు.
పాలకులు ప్రజల నాడి పట్టుకుని వారి మానసిక తత్వాన్ని,ఆలోచనా రాహిత్యాన్ని తమ స్వార్థానికి అనుగుణంగా వాడుకుంటున్నారు.
ప్రజల్లో నిర్మాణాత్మకమైన ఆలోచనలు లేవు పాలకుల యొక్క దుర్నీతికి,స్వార్థానికి ప్రజలు "యధా రాజా తథా ప్రజా"అన్నట్టు తాము వారి అవినీతిలో భాగమై పోతున్నారు.
ప్రజా సేవ చేయాల్సిన పాలకులు ప్రజలను మోసగించడంలో మాట మార్చడంలో, అబద్ధాలతో, తమ అధికారాన్ని,పదవులను కాపాడుకుంటున్నారు.
కొందరు అధికారులు లంచగొండితనం అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలు కూడా అలవాటు పడి లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు.
సమాజంలో అవినీతి విషంలా పాకిపోయింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 52a(h) ప్రకారం ప్రభుత్వం ప్రజల్లో వైజ్ఞానిక దృక్పధాన్ని ప్రచారం చేయాలి.
కానీ పాలకులు అలా ప్రచారం చేస్తే తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని, తమ పదవులకు భంగం కలుగుతుందని, ప్రశ్నించే వారు ఎక్కువవుతారని, తమ లాభాలు తగ్గిపోతాయని ప్రచారం చేయడం లేదు.అందువల్ల ప్రజలు వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోవడంలేదు.పాలకులు ఆచరించిన మత ప్రచారాలు, మత సంప్రదాయాలను ప్రజలు ఆచరిస్తున్నారు.
ప్రజలు అజ్ఞానంలో, అమాయకత్వంలో
మతమూఢత్వంలో అజ్ఞాన పూరితమైన దైవభావనలో,ఆలోచన రాహిత్యంలో ఉంటేనే ప్రభువులకు లాభం.
అందుకే వారు కులాలను, మతాలను,
దేవుడిని ప్రజల్లో ప్రచారం చేయడానికి తోడ్పడుతారు.
మూఢత్వాన్ని అజ్ఞానాన్ని ప్రచారం చేసే వారికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందజేస్తారు.
"మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం" "ధూమపానం క్యాన్సర్ కారకం"అని టీవీలలో, సినిమాలలో పేపర్లలో ప్రభుత్వాలు ప్రచారాలు చేస్తున్నాయి.
కానీ మద్యపానానికి,సిగరెట్ల తయారీకి లైసెన్సులు ఇచ్చి తయారు చేయడానికి అనుమతి ఇస్తారు. పాలకుల దుర్నీతికి ఇది నిదర్శనం కాదా?
మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు, ధూమపానం వల్ల ఎందరో రోగాలకు గురవుతున్నారు. ప్రజలు ఆరోగ్యానికి దూరమవుతున్నారు.
అయినా పాలకుల చీమ కుట్టినట్లయినా లేదు.
ఇది సమాజాన్ని నాశనం చేయడం కాదా?
పాలకులు జాతరలు, దేవుళ్ళ కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, చండీ యాగాలు, పూజలు, యజ్ఞాలు, అర్చనలు లాంటి వాటిలో ప్రత్యక్షంగా పాల్గొంటారు.
కొత్త దేవాలయాలు నిర్మించడానికి,
ఉన్న దేవాలయాలను పునరుద్ధరించడానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు.
"సర్వ మత సామరస్యం"పేరుతో అన్ని మతాలను ఆదుకుంటామని, కులాల కాపాడటానికి కులాల వారీగా భవనాలు కట్టించడం, దేవాలయాలకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం లాంటి కార్యక్రమాలతో ప్రజల భావాల్లో గల మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని చెదిరి పోకుండా కాపాడుతుంటారు. ఇలాంటి అహేతుక భావాలు,కార్యక్రమాలతో
ప్రజలను అజ్ఞానంలో ఉంచి తమ పబ్బం గడుపుకుంటున్నారు.
ప్రశ్నించిన వారిని హత్యలు చేయిస్తున్నారు. జైల్లో వేస్తున్నారు.
ఈ విధంగా పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను అజ్ఞానంలో ఉంచుతున్నారు.
ఇక కొందరి ప్రజాప్రతినిధుల మాటలకు అంతులేదు . ఆధారాలు లేవు "ఇప్పటి ఆధునిక విజ్ఞానమంతా తమ మత గ్రంథాల్లో ఉందని, ఏనాడో మనవాళ్ళు కనిపెట్టారని,
పూర్వము విమానాలు ఉండేవని, రావణుడు గొప్ప ఇంజనీరు అని రావణుని దగ్గర పుష్పకవిమానం ఉండేదని,రావణవధ అనంతరం
రామలక్ష్మణులు సీతతో సహా పుష్పక విమానంలోనే అయోధ్యకు వెళ్లారని,
శస్త్ర చికిత్సలు కూడా ఉండేవని,వినాయకుడి తల అతికించడం శస్త్ర చికిత్స ఉందని ఉదాహరణగా చెబుతారు.
ఈ విధమైన అజ్ఞాన పూరిత ప్రకటనలతో ప్రజలను అజ్ఞానం లోనే ఉంచుతున్నారు.
ఇక అత్యంత, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన విజ్ఞానాన్ని, మనసాంకేతికతను ఇతర దేశాలవారు దొంగతనంగా తీసుకువెళ్లి ఆవిష్కరణలు చేస్తున్నారని పిచ్చిమాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన నాయకులు ప్రజలను పీడించి,తాము మాత్రం సుఖభోగాలు అనుభవిస్తున్నారు.ప్రజల్ని అజ్ఞానంలో. మతానికి,దేవుడికి తమకు బానిసలుగా చేసుకుంటున్నారు.
4) చలనచిత్రాలు (సినిమాలు)
********
మొట్టమొదటగా తోలు బొమ్మల ఆటతో ప్రారంభమైన ఈ కళ రానురాను సాంకేతికత అందుకొని, నేటి సినిమాగా,చలనచిత్రంగా ఆవిర్భవించింది. రూపు దిద్దుకున్నది.
సినిమా అనేది ఒక శక్తివంతమైన కళ.
ప్రజల భావాలను మార్చగలిగి, ప్రజల్లోకి అత్యంత వేగంగా చొచ్చుకుపోయే ఒక సాధనం.
అటువంటి సినిమా పుక్కిటి పురాణాలతో, అసంబద్ధమైన,అసహజమైన భావాలతో ప్రారంభమైంది.
అలా పుక్కిటి పురాణాలతో ప్రారంభమైన సినిమా కళ సామాజిక సమస్యలను ప్రతిబింబించే స్థాయికి ఎదిగింది.
కానీ కొద్ది కాలం గడిచిన పిదప హింస,దౌర్జన్యం,ప్రేమ లాంటి మానసిక ఉద్వేగాలు అనే అవలక్షణాలతో సినిమాలు తయారవుతున్నాయి.
ప్రజలకు తప్పుడు సంకేతాలు,తప్పుడు సందేశాలు ఇస్తున్నాయి ప్రేమ, హింస,దౌర్జన్యం ఇవి నేటి సినిమాల్లోని అంశాలు.
మత బోధనలతో, దైవ భావనతో,పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ముకాసే విధంగా సినిమాలు తయారవుతున్నాయి.
5) ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా.
***********
ఏవైనా సంఘటనలు విషయాలు సమాజంలో జరుగుతున్న మంచి చెడులు త్వరగా ప్రజలకు తెలియాలంటే ఎలక్ట్రానిక్ మీడియా అత్యంత వేగంగా అందజేస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన క్షణాలలోనే ప్రపంచమంతా తెలిసిపోతుంది.
ఇంతటి శక్తివంతమైన మీడియా (మాధ్యమము) ప్రజలకు విజ్ఞానాన్ని అందించాలి సత్ప్రవర్తన, సచ్ఛీలతను నేర్పాలి కానీ ఊహలతో అల్లిన పురాణములను మత గ్రంథాలను ఆధారంగా చేసుకుని అందులోని పాత్రలను దేవుళ్ళుగా,అవి నిజంగా జరిగినవని,పనిగట్టుకొని,తమ లాభాపేక్షతో అజ్ఞానాన్ని,మూఢత్వాన్ని,అబద్ధాలను ప్రజల్లో విరివిగా ప్రచారం చేస్తున్నది.
హేతుబద్ధమైన విషయాలను ప్రజల అభివృద్ధికి కావలసిన జ్ఞానాన్ని,ప్రజలు స్వేచ్ఛగా,సమానంగా ఉండటానికి దోహదం చేసే విషయాలను కానీ ప్రచారం చేయడం లేదు.
టీవీలలో ప్రదర్శించే సీరియల్లలో,సంస్కృతి సంప్రదాయాలను రక్షిస్తున్నా మని కల్లబొల్లి మాటలతో,దుష్ట సంప్రదాయాలను, కుసంస్కృతిని విరివిగా ప్రజల్లోకి వదులుతున్నారు.
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు.
అవలక్షణాలతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తున్నారు.
ప్రింట్ మీడియాలో కూడా మెరుగైన సమాజాని
కి అవసరమైన విషయాలను ప్రచారం చేయడంలేదు.
దిన పత్రికలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి. పార్టీల విధానాలను,ప్రచారం చేస్తున్నాయి
అంతే కానీ ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి తగు సూచనలను అందజేయడం లేదు.
ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ అజ్ఞానం అజ్ఞానం గా మత ధర్మమే మానవ ధర్మంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి
6) మేధావుల ఉనికి.
******
"మేధావుల స్తబ్దత దేశానికి ప్రమాదకరం"
ఈ మాట అన్నది మేధావులే.
మేధావుల నిశ్శబ్దం వల్ల,
వారు ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం వల్ల,
ప్రజల్లోని మూఢవిశ్వాసాలు,అజ్ఞానం అలాగే కొనసాగుతూ వస్తున్నది.
మేధావులు ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం వెనుక వారికి రాజ్యహింస భయం ఎక్కువగా ఉన్నది. ప్రభువులను ప్రశ్నిస్తే తమకు తమ కుటుంబానికి హాని కలుగుతుందని భయపడుతున్నారు.
ఈ భయమే వారిని గడపదాటనివ్వడం లేదు.
ప్రశ్నించిన వారిని హేతువాదాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలనుకునే వారిని ప్రభుత్వాలు కొందరిని గొంతు నొక్కడం చంపేయడం లాంటి సంఘటనల వల్ల మేధావులు భయపడుతున్నారు.
కానీ ఎన్నాళ్ళు జంకు?
భయపడితే ఇంకా భయ పెట్టించే వారు
అధికమ వుతుంటారు.
అందుకే సమాజంలో
మేధావుల ఉనికి ప్రశ్నార్థకమైంది.
సమాజంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, డాక్టర్లు,ఇంజనీర్లు,న్యాయవాదులు,శాస్త్రవేత్తలు, పరిశోధకులను మేధావులుగా పరిగణిస్తుంటారు.
వారు వివిధ కారణాలచే తమకున్న మూఢత్వాన్ని వదలలేకున్నారు.అర్థంలేని, ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు,అందరు కాదు కానీ కొందరు మాత్రం అదే భావనలో ఉన్నారు.
వారిని ఉన్నత విద్యావంతులుగా, మేధో వంతులుగా చూస్తున్న ప్రజలు వారి విధానాలనే అనుసరిస్తున్నారు.
వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు.
వారి విద్య కేవలం బతుకు తెరువు కోసమో, జీతభత్యాల కోసం మాత్రమే ఉపయోస్తున్నారు తప్ప శాస్త్రీయ దృక్పథం వారిలో లేదు.
శ్రీహరికోటలో రాకెట్ నమూనా తయారు చేసి, దేవుని ముందు పెట్టి పూజించడం, శాస్త్రవేత్తలు బాబాల,స్వామీజీల కాళ్లపై పడి సాష్టాంగ దండ ప్రణామాలు చేయడం, గుళ్ళకు,గోపురాలకు తిరగడం ఇవన్నీ కూడా మేధావుల మూఢత్వం లోని భాగాలే.
ఇక సైన్సుని చదివి,ఎన్నో డిగ్రీలు తీసుకొని పాఠశాలల్లో,కళాశాలల్లో,యూనివర్సిటీల్లో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ విద్యార్థులకు వైజ్ఞానిక దృక్పథంతో విద్యను బోధించడం లేదు. కేవలం డిగ్రీలు సంపాదించడానికి అన్నట్టుగా విద్య బోధిస్తున్నారు.
మేధావులు తమ జంకు గొంకు విడిచిపెట్టి,ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి సామాజిక స్థితిగతులను అవగాహన కల్పించాలి.
7) బాబాలు, స్వామీజీలు, అమ్మలు
*********
మనదేశంలో చూసినా,రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బాబాలు,స్వామీజీలు , అమ్మలు,మంత్రగాళ్ళతో నిండిపోయి ఉన్నాయి ప్రజల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని అసరాగా తీసుకొని,లేనిపోని కల్లబొల్లి మాటలు కల్పించి, వారి బలహీనతలను గుర్తించి, "దేవుడున్నాడని మేము స్వామీజీలమని, సరాసరి దేవునితో మాట్లాడతామని,దేవుని కృప మాకు ఉన్నదని మమ్ముల దర్శించుకుంటే, పాద పూజ చేసుకుంటే దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడని, కాపాడతాడని"
ప్రజల యొక్క ధనాన్ని,సమయాన్ని, వారి స్వలాభం కోసం,వారి స్వార్థం కోసం ప్రజలను వంచించి దోపిడీ కొనసాగిస్తున్నారు.
"ప్రజల అజ్ఞానం, మూఢత్వమే" పెట్టుబడిగా కోట్లాది రూపాయలు సంపాదించి,
విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
ప్రజలు వారి మోసాన్ని,వంచనను గ్రహించక, ఆలోచించక నమ్మి తమ కష్టార్జితాన్ని వారి పాదాలపై పోసి నిరుపేదలుగా మారుతున్నారు.
ఇక వైజ్ఞానిక స్పృహ సమాజంలో ఎలా కలుగుతుంది?
బాబాల స్వామీజీల ఆకృత్యాలు, దారుణాలు, లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కాబడి ఎంతో మంది జైళ్లలో ఉన్న విషయాలను చూస్తున్నాము.
అయినా కూడా ప్రజల్లో వారిపట్ల నమ్మకం తగ్గలేదు. వారి మాటలకు ప్రజలు మోసపోతూనే ఉన్నారు.ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు.
ప్రభుత్వాలు పూనుకొని అటువంటి బాబాలను, స్వామీజీలను అరెస్ట్ చేసి , అట్టి విధానాలను అనుసరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.
8) దెయ్యాల మాంత్రికులు
*******
దేవుడు ఉన్నాడని, దేవుడు ఉంటే దెయ్యాలు కూడా ఉంటాయని ప్రజల్లో ప్రచారం చేసి ప్రజలను భ్రమల్లో ముంచి కొందరు తాము దయ్యాలను పారద్రోలు తామని లేనిపోనివి కల్పించి చెప్పి,
ఏ అనారోగ్యాలు అయినా అది దయ్యం పట్టిందని, ఏవో అస్పష్టమైన మంత్రాలు చదువుతూ తాము దెయ్యాల మాంత్రికుల మని ప్రకటించుకుంటున్నారు.
ప్రజలు తమకు కలిగిన శారీరక, మానసిక ఆరోగ్యాలకు, దయ్యాలే కారణమని, మాంత్రికులు గా చలామణి అవుతున్న వారు చెప్పిన మాటలు విని, వేలాది రూపాయలు వారికి సమర్పించుకుంటున్నారు.
దారుణంగా మోసపోతున్నారు.
ఇక వ్యాపారస్తుల కల్తీ నేరాలు, చిట్టీల పేరుతో ఎంటర్ ప్రైజె స్,లాంటి సంస్థల స్థాపించి ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపించి,ప్రజల్ని మోసగిస్తున్న సందర్భాలు మన సమాజంలో విరివిగా చూస్తున్నాము.
సైబర్ నేరాలు కొత్త కొత్త విధానాలతోప్రజల్ని మాయమాటలు చెప్పి ప్రజల నుండి కోట్లాది రూపాయలు కొట్టేస్తున్న విషయాలను
మనం రోజు పేపర్లో చూస్తున్నాము.
తమ భవిష్యత్తు తాము తెలుసుకోలేని మూర్ఖులైన జ్యోతిష్యులు.
భూమి గుండ్రంగా ఉన్నదని, అలాంటి దానికి మూలలు ఎలా ఉంటాయని, కనీస జ్ఞానం లేని, ఆజ్ఞానులైన వాస్తు నిపుణులు,
గోడలు మారిస్తే గొడవలు తగ్గుతాయి,సంపదలు వచ్చి పడతాయి అని అజ్ఞానంగా
చెప్తారు.
చేతిలో గీతలు బట్టి చెప్పే హస్తసాముద్రికులు.
పేరులో ఒక అక్షరం మార్చుకుంటే కోరిన కోరికలు సిద్ధిస్తాయని చెప్పే దోపిడీ పరులైన న్యూమరాలజిస్టులు.
ఇంకా చిలకజోస్యం, గవ్వల జ్యోతిష్యం, సోది చెప్పడం,జాతక చక్రం ఇలాంటి మోసాలతో, సమాజంలో ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు.
అయిననూ ప్రజలు ఈ సంఘటనలతో పాఠాలు నేర్చుకోవడం లేదు మరల అదే ఆశలతో వారి బారిన పడుతున్నారు .
ఇలాంటి వారిని ఆశ్రయించి మోసపోతున్న సందర్భాలు ఈ సమాజంలో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.
ఈ విధమైన సమాజాన్ని మార్చాల్సిన అవసరం నేటి యువతరం పై ఆధారపడి ఉన్నది యువతరం ఆలోచించి స్వీయ నిర్ణయాల ద్వారా ఏది మంచో ఏది చెడో హేతువాద దృక్పథంతో ఆలోచించి సమాజాన్ని సరియైన బాటలో ఉంచగలరని ఆశిద్దాం...........
అడియాల శంకర్,
అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం