Download Post
2 months, 2 weeks
ఏపీలో జిల్లాల పునర్విభజనకు రంగం సిద్ధం..!?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
మొదటి ఐదేళ్లు టీడీపీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మొదటి ఐదేళ్లు టీడీపీ అధికారంలోకి రావడంతో జిల్లాల జోలికి పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలను అలాగే ఉంచి పరిపాలన సాగించారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ అధికారంలోకి రాగానే పార్లమెంటు నియోజకవర్గాలకు అనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేసింది. మన్యం జిల్లాను మాత్రం కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇలా జిల్లాలను పునర్విభజించడపై కొన్ని చోట్ల అభ్యంతరాలు తలెత్తాయి.
జిల్లాల పునర్విభజన సక్రమంగా సాగలేదని.. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలు రాజదాని అమరావతి కంటే దూరంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. దీంతో తాము అధికారంలోకి వస్తే జిల్లాలను పునర్విభజిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో జిల్లాలను పునర్విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లాల పునర్విభజన ఎలా ఉంటుంది.. ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలోకి వెళ్తాయి.. మొత్తం ఎన్ని జిల్లాలు ఏర్పాటవుతాయి.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో మెజారిటీ బాగానే ఉన్నాయి. అయితే అక్కడక్కడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలను కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. దీనికి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారు. అలాగే మార్కాపురం, డోన్, పోలవరం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న జిల్లా కేంద్రాలను మార్చితే ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంది. ఈ జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇబ్బందులు తలెత్తడం ఖాయం.
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా త్వరలోనే అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాదిలోపే జిల్లాల పునర్విభజనను పూర్తి చేస్తారని తెలుస్తోంది. దాదాపు 32 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ కంటే తక్కువ భూభాగం, జనాభా ఉన్న తెలంగాణలో (Telangana) 31 జిల్లాలున్నాయి. అలాంటిది ఏపీకి 32 జిల్లాలు ఉండడం సబబే అని కొందరు వాదిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి జిల్లాలు పెరిగితే మరింత భారం తప్పదని, అన్ని జిల్లాలు అవసరం లేదనే వాళ్లూ ఉన్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.