మహాకుంభమేళా-2025

Download Post





3 months, 3 weeks

"మహాకుంభమేళా-2025" సంక్రాంతి నుండి శివరాత్రి వరకు- 13 జనవరి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు పవిత్ర గంగా యమునా సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్ లో జరుగబోతున్నది.||

వివరాలు:
  12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని 'కుంభమేళా' అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని 'అర్థ కుంభమేళా' అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను 'మాఘీమేళా' అనే పేరుతో పిలుస్తారు. బాండము ను 'కుంభము' అని 'కలశం' అని అంటారని మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. 

కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు:
    1.ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ వద్ద గంగానదిలో,
2.మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని వద్ద క్షిప్రానదిలో,
3.మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద గోదావరి నదిలో 
4.ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ లో గంగా, యమునా మరియు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద.

   ప్రస్తుతం విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి అక్కడి నుండి శివుడి జటాజూటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుండి భువికి దిగివచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో కుంభమేళా జరుగబోతున్నది. మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలోనే యాజ్ఞవల్క్య మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారని పురాణాలు తెలియజేస్తున్నాయి.

చరిత్ర:
          మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దాసిగా ఉన్న తల్లి వినితను మరియు తనను,  పినతల్లి కద్రువ బానిసత్వం నుండి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుపాముల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక  రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు ఎదురుగా  వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మె పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే నీవు అమృత బాండాన్ని నాగులకప్పగించి, వారి ఎదురుగా దర్బలపై ఉంచి నీవు నీ తల్లి విముక్తులు కాగలరు. వెనువెంటనే ఆ అమృతాన్ని వారికి దక్కకుండా దేవలోకం తీసుకొని వెళ్తానని చెప్పి అలాగే చేశాడు ఈ క్రమంలోనే కలశం నుండి అమృతం భూలోకమున నాలుగు నదులలో నాలుగు చోట్ల కొన్ని చుక్కలు పడినట్లు చరిత్ర, ఆ అమృతపు బిందువులు పడిన  ప్రదేశములను పుణ్యస్థలాలుగా తీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది.

కుంభమేళాలో:
   కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేకానేక వేడుకలు. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు మరియు విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత మునుల చేత సన్యాసుల చేత నెలల తరబడిగా ఆ ప్రాంతంలోనే డేరాలు వేసుకుని ఉండి కఠిన సాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త క్రొత్త విషయాలను దేశం నలుమూలల నుండి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. సమాజానికి పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయం అది.

ధర్మరక్షణ కోసం:
    కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు మరియు రథాలపై ' వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయిక ఊరేగింపు సమయంలో నాగ సాధువులు మండలేశ్వరులు మహామండలేశ్వరులు మరియు అఖాడాలు (వ్యాయామాలు చేసి శక్తివంతులుగా తయారై, తమకు తాము సమాజం కోసం సమర్పించుకున్న దళాలు) కత్తులు, త్రిశూలాలు గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనుక శిష్యులు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు అనంతరం 'షాహిస్నాన్' పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ, 'ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు'. పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశము చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు, కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు.

సామాజిక సమరసత వెల్లివిరిసే చోటు:
         పుణ్య స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుండి ప్రపంచంలోని అనేక దేశాల నుండి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాల బేధాలు మరిచిపోయి, కులాలు మరిచిపోయి, ఆరాధనా పద్ధతులు ఏవైనా తరతమ బేధాలు పాటించకుండా కుంభమేళా సమయంలో కలసి స్నానాలు చేస్తారు ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ గుడారాలు వేసి ఆవాసం ఏర్పాటు చేయడం, మంచినీళ్లు పానీయాలు, అల్పాహారాలు,భోజనాలు అందించడం, రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాలకు చెందిన తమతమ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం, వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేస్తుఉంటారు.

సంత్ సమ్మేళనాలు - విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునఃప్రారంభం:
                      ప్రతి 12 సం.లో ప్రకృతిలో వచ్చే మార్పులు, కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలు మరియు నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు. ఇలా లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా చరిత్ర. కానీ దురదృష్టవశాత్తు రాజా శ్రీహర్షుని పాలనా కాలం 644 వ సం.లో జరిగిన సంత్ సమ్మేళనం తర్వాత విదేశీ దండయాత్రల కారణంగా సాధారణ పుణ్యస్నానాలు చేయడం జరిగినప్పటికీ, కుంభమేళ సందర్భంగా స్వామీజీల సమావేశాలు, తీర్మానాలు ప్రబోధాలు ఆగిపోయాయి మళ్లీ 1966వ సంవత్సరం నుండి పునః ప్రారంభం అయినాయి, 
1964 సంవత్సరంలో ప్రారంభించబడిన విశ్వహిందూ పరిషత్ 1966వ సం. లో జరిగిన కుంభమేళాలో ప్రపంచవ్యాప్తమైన హిందువులతో 'విశ్వసమ్మేళనం' నిర్వహించింది. ఆ సమయంలో  హిందూధర్మంలోని వివిధ ధార్మిక ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన ధర్మగురువులైన నలుగురు శంకరాచార్యులు, వైష్ణవాచార్యులు, నింబార్కాచార్యులు, బౌద్ధ జైన సిక్, గాణాపత్య, శాక్తేయ మరియు అనేకనేక వైవిధ్యం కలిగిన ఆరాధనా పద్ధతులు అనుసరించే వర్గాలకు నేతృత్వం వహించే పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ ప్రయత్నం వందల సంవత్సరాల తర్వాత  పూజ్యులు మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ గారి నాయకత్వంలో విశ్వహిందూ పరిషత్ చేసిన ప్రయత్నం కారణంగా సాధ్యపడింది. 

   2024 లో జరిగే కుంభమేళాలో కూడా జనవరి 24,25వ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం,  26 తేదీన దేశం నలుమూలల నుండి 128 వివిధ ఆరాధన మార్గాలకు చెందిన 'సంత్ సమ్మేళనం',  27వ తేదీన 'యువ సంత్' (యువ సన్యాసుల) సమ్మేళనం జరగబోతున్నది

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సామూహం: 
          చంద్రమండలం పైన నిలబడి భూమి వైపు చూస్తే కనబడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళా, ప్రపంచంలోనే అతి పెద్దదైన మానవ సమూహం కలిసే సన్నివేశం కుంభమేళ, ప్రపంచంలోని 13వ వంతు ప్రజలు పాల్గొనే సన్నివేశం కుంభమేళ, సగం దేశాల జనాభా కంటే ఎక్కువ. 2017 వ సంవత్సరం అర్థ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొన్నట్లుగా 2001 వ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు.

  ప్రాచీన కాలంలో ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్ సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 సం.లో బెంగాల్ కు చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా, మరియు తులసీ రామాయణాన్ని వ్రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర.

కుంభమేళా పవిత్ర స్నానానికి ఆంక్షలు.?? :
     భారతదేశంలోని పాలకుల మధ్యన జరిగిన యుద్దాలలో ఎవరు గెలిచినప్పటికీ ఇక్కడి సాంస్కృతికపరమైన ఉత్సవాలను కార్యక్రమాలను గెలిచిన రాజు కూడా నిర్వహిస్తూ ఉండేవాడు కానీ దురదృష్టం విదేశీ ఆక్రమణకారులు తమ కుట్రలతో కుతంత్రాలతో స్థానిక పాలకులను జయించి ఇక్కడి ఆలయాలను కూల్చివేశారు కుంభమేళాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు, కొన్ని సంవత్సరాలు ఆగిపోయాయి కూడా, కానీ.. స్థానిక ప్రజలకు తమ ధర్మంపట్ల ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని కాదని అణిచివేస్తున్న విదేశీ పాలకులపై తిరుగుబాటు చేయడాన్ని గమనించి మధ్యేమార్గంగా పన్ను చెల్లించి పూజలు చేసుకోండని ప్రకటించారు,  'జిజియా పన్ను' వసూలు చేశారు, ఇలా బొట్టు పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి, జుట్టు పెంచుకోవడానికి మరియు  'కుంభమేళాలో స్నానం చేయడానికి పన్ను చెల్లించి ధార్మిక కార్యక్రమాలు జరుపుకొని తమ ధర్మాన్ని కాపాడుకున్నారు ఆనాటి ప్రజలు'. 

ఆంగ్లేయుల కాలంలో:
   1806లో ఆంగ్లేయులు కుంభమేళా యాత్రికుల నుండి స్నానం చేయాలనుకునే వారికి 1 రూపాయి పన్ను విధించిందనీ 'వెల్ష్ ట్రావెల్ పుస్తకం రైటర్ ఫానీ పార్క్స్' వ్రాశాడు, ఆ రోజుల్లో "మనిషికి ఒక నెల రోజుల పాటు సుఖంగా జీవించడానికి 1 రూపాయి సరిపోతుంది" అటువంటి ఒక రూపాయి చెల్లించి స్నానం ఆచరించేవారు అని చెప్పాడు. 
    అతనికి సమకాలీనుడైన ఆంగ్లయుడు మరొక పుస్తకంలో, కంపెనీ  మూడు రూపాయలు పన్ను విధించిందని స్థానికులైన హిందువులు వాటిని చెల్లించి కుంభమేళాలో స్నానం చేశారని, నది ఒడ్డున కూర్చున్న వేద పండితులకు, పేదబ్రాహ్మణులకు దానధర్మాలు మరియు బహుమతులు సమర్పించుకునే వారని కూడా వ్రాసాడు.

ప్రయాగరాజ్ వటవృక్షం:
       స్థానిక ప్రజలను విదేశీ ఆక్రమణకారులు తమ మతంలోకి మార్చి లేదా గోమాంసం తినిపించి ధర్మ బ్రష్టులను చేస్తే వారందరూ బాధతో 12 సం.లకు ఒకసారి కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో  పుణ్యస్నానం ఆచరించి ఆ పక్కనే 'కల్పాంతము నాటి నుండి భూమిపై ఉన్న 'వటవృక్షం' క్రింద కూర్చుని పూజలు జరిపి తమ పూర్వీకులను గుర్తు చేసుకుని తిరిగి సనాతన ధర్మాన్ని తిరిగి పాటించేవారు'. 
    స్థానికులను ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్న విదేశీ ఆక్రమణకారుడు బాబర్ వారందరూ తిరిగి తమ మాతృ ధర్మంలోకి వెళ్తున్నారని గమనించి కుంభమేళా స్నానం, గంగానది స్నానంపై ఆంక్షలు విధించాడు, వటవృక్షం కింద పూజలు చేయకూడదని ఫత్వా జారీ చేశాడు, వటవృక్షాన్ని కూల్చివేశాడు కొంతకాలానికి వటవృక్షం చిగురించింది. ఆ తదుపరి మరొకసారి అక్బర్ వటవృక్షాన్ని కూల్చివేశాడు కొన్నాళ్లకే మళ్లీ చిగురించింది, ప్రజలు యధావిధిగా ఆ చెట్టు కింద పూజలు చేస్తూ స్వధర్మంలోకి వస్తున్నారు ఇది గమనించిన ఔరంగాజేబ్ ఒకవైపు జిజియా పన్ను ( హిందువుగా బ్రతకడానికి పన్ను) విధించడం  మరోవైపు వటవృక్షాన్ని విధ్వంసం చేయించి సీసం (లెడ్) పోయించాడట అయినప్పటికీ కొంత కాలానికి మళ్లీ చిగురించింది 'హిందూ ధర్మం వలే అనేక ఆటుపోట్లు అనుభవించి మళ్లీ జీవం పోసుకుంది'. ఇప్పటికీ ప్రజలు ఆ మర్రిచెట్టును దర్శించుకుని తమ పూర్వీకులను గుర్తుచేసుకొని పూజించుకుని వస్తారు.

స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిలూదిన కుంభమేళ: 
                    దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ధార్మిక ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్ర్యం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు. అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన గరుత్మంతుడిని గుర్తుచేసుకొని భారతమాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకొని వెళుతుండేవారు. దేశవ్యాప్తంగా తిరుగుబాటు ఆందోళనలు జరగడానికి మరియు స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి. 

విశ్వహిందూ పరిషత్ 1966 సమ్మేళనం: 
      1964 సంవత్సరం ప్రారంభమైన పరిషత్ 1966వ సంవత్సరంలో విశ్వసమ్మేళనం జరుపగా 12 దేశాల నుండి 25 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మేళనానికి మార్గదర్శనం చేసిన స్వామీజీలు మతం మారిన హిందువులందరినీ తమ పూర్వ ధర్మంలోకి రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఇప్పటికీ 15 లక్షల తిరిగి తమ మాతృధర్మం లోకి వచ్చినట్లుగా సమాచారం. అప్పటివరకు విదేశాలకు మరియు సముద్ర ప్రయాణాలకు అనుమతి లేని సమయం. ఈ సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు విదేశాలకు ధర్మప్రచారం కోసం, మరియు ఆయా దేశాల్లో ఉన్న హిందువులకు వారి ఆలయాలలో అర్చకులుగా పురోహితులుగా ఉండి షోడశ సంస్కారాలు జరిగేటట్లుగా మార్గదర్శనం చేయడానికి కూడా వెళ్లాలని నిర్ణయం ప్రకటించారు. ఆ తదుపరి విదేశాలకు సంస్కారాలను అందించడానికి మరియు ధర్మ ప్రచారానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. గోవు సకల దేవతలకు నిలయమని గోవును రక్షించుకోవాలని ప్రకటించారు. గోరక్ష ఆందోళన చేపట్టి ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఆవులను కాపాడుకుంటున్నాం. అడవులలో మరియు మురికి వాడలలో ఉన్న పేదలకు సహకరించాలని వారికి సేవ చేయాలని ఆదేశించారు. అప్పటినుండి వేలాదిగా సేవా కార్యక్రమాలనూ విశ్వహిందూ పరిషత్ ప్రారంభించింది.

  ఈ సంవత్సరం ప్రయాగరాజ్ 'మహా కుంభమేళా'  జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగబోతోంది. మహా కుంభమేళా యొక్క ముఖ్యమైన తేదీలు 

 1 పౌష్య పూర్ణిమ: 13-01-2025/సోమవారం
 2 మకర సంక్రాంతి 14-01-2025/మంగళవారం మొదటి షాహిస్నానం
 3 మౌని అమావాస్య (సోమవతి) 29-01-2025/బుధవారం, రెండవ షాహిస్నానం
 4 వసంత పంచమి: 03-02-2025/సోమవారం, మూడవ షాహిస్నానం
 5 మాఘీ పూర్ణిమ: 12-02-2025/బుధవారం
 6 మహాశివరాత్రి: 26-02-2025/బుధవారం