Norovirus In US: అమెరికాలో విజృంభిస్తున్న వైరస్‌, అధికారుల వార్నింగ్‌ బెల్స్‌..!! మరోసారి చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ..!!

Download Post





3 months, 3 weeks

Norovirus In US: అమెరికాలో విజృంభిస్తున్న వైరస్‌, అధికారుల వార్నింగ్‌ బెల్స్‌..!!

అమెరికాలో నోరో వైరస్‌ విజృంభిస్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలో 91 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం, నోరో వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్‌ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. వాంతులు , విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులలో ఆందోళన మొదలైంది.

నోరో వైరస్ అంటే ఏమిటి?
నోరోవైరస్. దీన్నే కడుపు ఫ్లూ లేదా కడుపు బగ్ అని పిలుస్తారు. జీర్ణకోశానికి సోకే ఈ వ్యాధి వాంతులు, విరేచనాలు కలిగించి రోగులను డీహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. వాంతులు , విరేచనాలతో మొదలై కడుపు లేదా ప్రేగులలో మంటకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. చాలా మంది వ్యక్తులు 1-3 రోజుల్లో కోలుకుంటారు. కానీ వ్యాప్తి బాగా ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది.

లక్షణాలు వైరస్‌ సోకిన సాధారణంగా 12 -48 గంటల తర్వాత కనిపిస్తాయి. అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి బాడీ నొప్పులు ఉంటాయి. మూత్రం సరిగారాకపోవడం, నోరు పొడిబారడం, కళ్లు తిరగడం, అసాధారణమైన నిద్ర లేదా గందరగోళం లాంటి లక్షణాలుంటాయి. వైరస్‌ సోకిన రెండు రోజులపాటు తీవ్రత అధికంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది.

నోరో వైరస్ ప్రధానంగా జీర్ణ కోశాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణాశయం, తర్వాత కొనసాగింపుగా ఉండే పేగులపై అటాక్ చేస్తుంది. అందుకే ఇది సోకగానే కడుపులో మంట, వాంతి వచ్చేట్టు, కడుపులో తిప్పినట్టూ అవుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలు, సీనియర్‌ సిటిజన్స్‌ల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.

నివారణ, చికిత్స

నోరోవైరస్ అంటువ్యాధి కనుక ఈ వైరస్ వ్యాప్తికి పరిశుభ్రంగా ఉండటమే పెద్ద చికిత్స. ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్‌ కరోనా వైరస్‌ను చంపినట్టు నోరో వైరస్‌ను చంపలేవు.

ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా సబ్బు, నీటితో కడుక్కోవాలి. టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి.

క్లోరినేట్ చేసిన నీటిని వినియోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి.

పండ్లు, కూరగాయలను కడగాలి. బట్టలను కూడా వేడి నీటితో ఉతకడం మంచిది.

కాచి చల్లార్చిన నీటినే తాగడానికి వినియోగించాలి.

హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఇంట్లోనే ఉండి, విశ్రాంతి తీసుకోవాలి.

వ్యాధి తీవ్రతను బట్టి IV ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

చాలా మంది వ్యక్తులు తదుపరి చికిత్స తీసుకోవలసిన అవసరం లేకుండా కొన్ని రోజుల వ్యవధిలో కోలుకుంటారు

 

మరోసారి చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ..!!

మరోసారి చైనా వైరస్‌ల బారిన చిక్కుకుని విలవిలలాడుతుంది. పలు రకాల వైరస్‌ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతుండటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

చైనాలో మల్టిపుల్ వైరస్‌ల మూకుమ్మడి వ్యాప్తి నేపధ్యంలో ఆ దేశంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కోవిడ్-19తో పాటు ఇన్‌ఫ్లుయెంజా-A, HMPV, మైకోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్‌లు చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి.వైరస్ ల బారిన పడిన పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మరోసారి దేశంలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని తెలుస్తోంది. హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన చైనా ప్రభుత్వం వైరస్‌ల వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అక్కడి అధికార యంత్రాంగం వైరస్ ల నివారణ కోసమే అప్రకటిత యుద్ధమే చేస్తున్నారు.