మహాకుంభమేళా 2025 లో జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే

Download Post





3 months, 4 weeks

మహాకుంభమేళా 2025 లో జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే.....

దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు.
మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభమేళా ఏఏ ప్రాంతాల్లో ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇది 2025, ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. అంతకుముందు 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా నిర్వహించారు.

పుణ్యస్నానాలు- తేదీలు

మొదటి పుణ్యస్నానం జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజున జరగనుంది.

జనవరి 14న మకర సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారు.

జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.

ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభ సందర్భంగా పుణ్యస్నానాలు చేయనున్నారు.

ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్యస్నానాలు చేయున్నారు.

ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు.

మహాకుంభమేళాలో పుణ్యస్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున సాధువులు, నాగా సాధువులు, ఇతర శాఖల మహంత్‌లు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం చేసిన తరువాత సామాన్య భక్తులకు పుణ్యస్నానాలు చేసే అవకాశం లభిస్తుంది. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది హిందువులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కడకు తరలి వస్తుంటారు. మహాకుంభమేళా జరిగే సమయంలో త్రివేణిసంగమంలోని నీరు అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.

పుణ్యస్నానాలు- ప్రాంతాలు

ప్రయాగ్‌రాజ్‌....
యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో భక్తులు పూజలు, పుణ్యస్నానాలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇది. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుందని అంటారు.

హరిద్వార్....
కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పుణ్యస్నానాలు చేస్తారు. గంగానది.. పర్వతాలను వీడి ఇక్కడి నుంచే మైదానాలలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్.. హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంది. హరిద్వార్‌ను తపోవన్, మాయాపురి, గంగాద్వార్, మోక్ష ద్వార్ అని కూడా పిలుస్తుంటారు.

నాసిక్....
నాసిక్‌లో జరిగే కుంభమేళాను నాసిక్ త్రయంబక్ కుంభమేళా అని కూడా అంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి. త్రయంబకేశ్వరంలో 12 ఏళ్లకు ఒకసారి సింహస్థ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా, వేలాది మంది భక్తులు గోదావరి పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

ఉజ్జయిని...
ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన ఉంది.

🌹🌹🌹🙏🙏🙏