Download Post
4 months, 3 weeks
పుష్ప గండాన్ని దాటుతాడా?
పుష్ప 2 జ్వరం మొదలైంది. 5వ తేదీ టెంపరేచర్ లెక్క తేలిపోతుంది. తెరమీద ఒక అద్భుతాన్ని చూడబోతున్నారనే హైప్ క్రియేటయింది. నిజంగానే పుష్ప ఆ రేంజ్‌లో వుంటుందా? అంచనాలు ఎక్కువై బుడగ పేలుతుందా?
వినోదం స్థాయిలో వున్న సినిమాని జూదం స్థాయికి తెచ్చారు. వంద రెండొందల టికెట్ రెండు వేల వరకూ వచ్చింది. సినిమా బావుంటే డబ్బుని మరిచిపోతారు. తేడా కొడితే పచ్చిపచ్చి తిట్లు తిడతారు. జూదంలో ఆడించేవాడు ఎపుడూ గెలుస్తాడు. ఆడేవాడు ఓడిపోతాడు. సినిమా ఎలా వున్నా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి.
ఒకప్పుడు థియేటర్ బయట బ్లాక్ అమ్మేవాళ్లు. అపుడపుడు పోలీసులు దాడిచేసి చావబాదేవాళ్లు. ఇపుడు నేరం కాస్త చట్టంగా మారింది. నిర్మాతలే బ్లాక్ అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం కూడా సరేనని ధరలు పెంచడానికి పర్మిషన్ ఇస్తోంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. సినిమా నిత్యావసరం కాదు. చూడడం ప్రేక్షకుడి ఇష్టం. హీరోపై వున్న క్రేజ్, మొదటిరోజే చూడాలనే ఆత్రుత అతనితో డబ్బు ఖర్చు పెట్టిస్తోంది. హీరో, దర్శకుడు కలిసి తమ డిమాండ్‌ని క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారంలో లాభనష్టాలే వుంటాయి. న్యాయన్యాయాలుండవు. ప్రజల సొమ్ముని కాపాడే జవాబుదారీతనం ప్రభుత్వానిది. పెద్ద సినిమాలకి టికెట్ పెంచుకోవడం న్యాయమేనని, తమకి కూడా కాసిన్ని పన్నులు వస్తే చాలని ప్రభుత్వం కూడా నమ్ముతున్నపుడు రాబోయే రోజుల్లో మొదటి రోజు 5 వేలకి అమ్మినా ఆశ్చర్యం లేదు.
డబ్బులు పెట్టినవాడు సరుకులో క్వాలిటీ చూస్తాడు. అది వాడి హక్కు. సినిమా క్వాలిటీని ఎలా నిర్ణయిస్తారు? ఎవరు?
క్వాలిటీ అంటే థియేటర్‌లో ఈ ప్రపంచాన్ని మరిచిపోయి 3 గంటల 20 నిమిషాలుండాలి (పుష్ప రన్ టైం). 5 నిమిషాలు లాగ్ అయితేనే ఫోన్లు చూసుకునే కాలం. మరి ఇంతసేపు ఓపిగ్గా కూచోవాలంటే ఎంత విషయముండాలి.
హీరోలతోనూ, సినిమా నిర్మాణంలోని రిచ్‌నెస్‌తో క్వాలిటీ వస్తుందా అంటే చెప్పలేం. ఇవి ప్రేక్షకున్ని రప్పించడానికే తప్ప కూచోపెట్టడానికి కాదు. కదలకుండా వుండాలంటే కనెక్ట్ కావాలి. అది రసవిద్య , బ్రహ్మ రహస్యం. సుకుమార్‌కి ఎంతోకొంత ఈ రహస్యం తెలుసు. అయితే అతను కూడా చేతులెత్తేసిన సినిమాలున్నాయి. రంగస్థలం చివరి ట్విస్ట్‌తో నిలబడింది. పుష్ప 1కి కూడా మొదట్లో పాస్ మార్కులే వచ్చాయి. తరువాత అందుకుంది.
పుష్పమీద ఎవరికీ భారీ అంచనాలు లేవు. మెల్లిగా పాన్ ఇండియా సినిమాగా మారింది. పుష్ప 2కి సీన్ వేరే. దేశ వ్యాప్తంగా ప్రమోషన్ జరుగుతోంది. ప్రపంచమంతా 11500 స్క్రీన్స్ . ఈవెంట్స్‌కే వందకోట్లకి పైగా ఖర్చు. 2 వేల కోట్లు వసూళ్లు వస్తాయని అంచనా. అంటే వారం రోజుల్లో భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని తెలుగు, ఇతర భాషల సినిమా అభిమానులు చూసేయాలి.
సహజంగానే ఇంతపెద్ద ప్రాజెక్ట్‌లో హీరో, దర్శకుడు, నిర్మాతల మీద ఒత్తిడి బలంగా వుంటుంది. నూటికి 50 మార్కులొస్తే 80 మార్కులొచ్చినట్టు షో చేయచ్చు. కానీ బొటాబొటిగా వస్తే గ్రేస్ మార్కులు కలపలేం. సోషల్ మీడియా యుద్ధాలు జరుగుతాయి. జేబు ఖాళీ చేసుకున్న ప్రేక్షకుడి కోపాన్ని కూడా తట్టుకోవాలి.
అల్లు అర్జున్ గట్టి నటుడు. ఎంత బరువైనా అవలీలగా మోయగలడు. సినిమాని భుజాల మీద తీసుకెళ్లగలడు. అయితే కథలో వెయిట్ లేకపోతే అతను కూడా ఏం చేయలేడు. సూర్యలాంటి గొప్ప నటుడు కూడా కంగువతో ఎలా దెబ్బతిన్నాడో రీసెంట్‌గానే చూసాం. బన్నీ శక్తిని రెండింతలు చేసే వెయిట్ లిప్టింగ్ చేయించే బాధ్యత సుకుమార్‌ది, అతని రైటింగ్‌ది.
సుకుమార్ నిస్సందేహంగా మాస్టర్ స్టోరీ టెల్లర్. అయితే పుష్ప 2 కథ చాలా సంక్లిష్టం. నీ దగ్గర గుర్రం కాదు, రెక్కల గుర్రం వుంటుందని జనం వూహిస్తున్నారు. గుర్రం పరిగెత్తితే ఆనదు, ఎగరాలి.
కథలో అనుకూల అంశాలున్నాయి. అదే స్థాయిలో ప్రతికూల అంశాలున్నాయి. అనుకూలం ఏమంటే కథ ఆల్రెడీ అందరికీ తెలుసు. పుష్ప మానరిజమ్స్ , ఎదుగుదల, మూర్ఖత్వం, ఎమోషన్ అన్నీ పరిచితమే. కొత్తగా వివరించే పనిలేదు. ఆల్రెడీ పెళ్లయిపోయింది, లవ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అక్కర్లేదు. వ్యాపారం ఫిక్స్ అయ్యింది. విలన్లు షెకావత్, మంగళం శీను రెడీగా వున్నారు.
ఈ బ్యాగ్రౌండ్ నుంచి కథ ఎత్తుకోవాలి. ప్రతికూల అంశం కూడా ఇదే. ట్రైలర్‌లో పుష్ప అంటే బ్రాండ్, ఇంటర్నేషనల్, వైల్డ్ ఫైర్ అని చెప్పుకున్నారు. ఈ రేంజ్‌లో ఎలివేషన్ వుండాలంటే పుష్పకి లోకల్ విలన్లు చాలరు.
పార్ల్ -1లో పుష్పకి విలన్ల స్థాయి పెరిగింది. లోకల్ ఫారెస్ట్ అధికారి , కొండారెడ్డి, మంగళం శీను, ఎస్పీ షెకావత్ అంటే స్మగ్లర్ల నుంచి విలన్ స్థాయి పెరిగింది. అధికారుల నుంచి కూడా స్థాయి పెరిగింది. పార్ట్ 2లో ఇంటర్నేషనల్ స్థాయి విలన్ కావాలి. పొలిటికల్ సర్కిల్ నుంచి ఎవరైనా తగులుతారేమో తెలియదు.
పుష్ప 1లో ధైర్యం, కండబలం మాత్రమే కనిపించాయి. ఇంటెలిజెన్స్ లేదు. రిజర్వాయర్‌లో ఎర్రచందనం దుంగల్ని వదలడం లాజిక్‌లేని సినిమాటిక్ లిబర్టీ తప్ప, తెలివి కాదు. అతను ఏమార్చింది కొండారెడ్డి , మంగళం శీనులను మాత్రమే. షెకావత్‌తో ఇగో సమస్య తప్ప బుద్ధికి సంబంధించింది కాదు.
పుష్ప నుంచి ప్రేక్షకుడు కండబలాన్ని తప్ప బుద్ధి బలాన్ని ఆశించడు. నిజమే కానీ, హీరో 20 మందిని గాలిలోకి లేపితే అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతారు. అయితే సాధారణ ప్రేక్షకుడు కన్విన్స్ కాడు. అతనికి ఇంకేదో కావాలి. ఆ మ్యాజిక్‌నే ఎక్కువ మంది ఆశిస్తున్నారు.
పుష్ప 2 కథని ఎవరైనా సులభంగా ఊహించొచ్చు. ఎర్రచందనం సామ్రాజ్యాన్ని పుష్ప విస్తరిస్తాడు. షెకావత్ లేదా ఇంకో విలన్ గట్టిగా తగులుతారు. పుష్పని ఫినిష్ చేయడానికి ఎత్తుగడలు, పుష్ప అన్నీ ఎదుర్కొంటాడు. గంగజాతర వేషంలో గట్టి ఫైట్ చేస్తాడు. యాక్షన్ ఓకే. గూస్‌బంప్స్ క్రియేట్ అవుతాయి. విలన్లు, ఫైటింగ్‌లతోనే సినిమా హిట్ కావడం నిజమైతే బోయపాటి శీను తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అది కాదు. ఒకటి తగ్గితే అంతా వృథా. అది ఎమోషన్.
ఎమోషన్ అంటే అదో రసాయన చర్య. మనిషి ప్రవర్తన విచిత్రంగా వుంటుంది. పైకి విభిన్నంగా వున్నా ప్రపంచమంతటా మనుషులు ఒకటే. నిజ జీవితంలో అన్నదమ్ముల్ని ద్వేషించేవాళ్లు కూడా , సినిమాలో అన్నదమ్ములు విడిపోతే కన్నీళ్లు పెడతారు. పైకి మనమంతా కమర్షియల్‌గా మారిపోయినట్టు కనిపిస్తాం కానీ, లోపల మనకి కూడా తెలియని వ్యక్తి వుంటాడు. అందుకే కళ విషయంలో మనుషులు యూనివర్సల్‌గా వుంటారు. అనంతపురంలో హిట్ అయిన సినిమా అమలాపురంలోనూ, అమెరికాలో కూడా హిట్ అవుతుంది.
సుకుమార్ సినిమాల ప్రత్యేకత కూడా ఇదే. ఎమోషన్ బలంగా చెబుతాడు. పుష్పకి తల్లి అంటే ప్రేమ. తండ్రి లేని బాధ. శ్రీవల్లి కోసం ఎంత దూరమైనా వెళ్లే తత్వం. ఎమోషన్స్ ఈ చట్రంలోనే రావాలి. కొత్తగా అంటే పుష్పకి పిల్లలు పుట్టాలి.
తల్లితో ఎమోషన్ అంతగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి అతడికి సంఘర్షణ అంటూ వస్తే శ్రీవల్లి నుంచే వస్తుంది. నేర జీవితం వదిలేయమని ఎదురు తిరగాలి. లేదా విడిపోవాలి. ఆర్థికంగా బలవంతుడు కాబట్టి తండ్రి తరపున వాళ్లు దగ్గరికి రాలేరు. తల్లికి హాని చేయడం మిగిలిన కోణం.
అయితే రెగ్యులర్ ఫార్మట్స్ దాటుకుని ఒక కొత్త ప్రపంచాన్ని, ఎమోషన్‌ని సృష్టించి వుంటే సుకుమార్ గ్రేట్. ఎర్రచందనం నరకాలంటే అందరూ నడిచే దారిలో రాకూడదు. కొత్తదారి ఏర్పరచుకోవాలి. పుష్ప 2లో సుకుమార్ అదే చేసి వుంటాడని ఆశిద్దాం.
సుకుమార్ సినిమాల్లో అందరూ ఊహించే ఐటం సాంగ్ ఎందుకో వీక్‌గా వుంది. ఊ అంటావా మామాతో పోల్చుకోవడం ఒక కారణం కావచ్చు. దెబ్బలు ఎవరికి పడతాయో ఐదో తేదీ డిసైడ్ అయిపోతుంది.